- - ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన
నల్లగొండ : ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉండాలని ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ అన్నారు.
గురువారం నల్లగొండ పట్టణంలో క్లాక్ టవర్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, శివాజీ నగర్ తో పాటు వివిధ ప్రాంతాలలోని ఆటో స్టాండ్ ల వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఆటో డ్రైవర్ పరిమితి ప్రకారమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ప్రమాదాల నివారణ కోసం విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనం మంచి కండిషన్ లో ఉండేలా చూసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. లౌడ్ స్పీకర్లు, భారీ శబ్దాలతో ఉండే డెక్ లను తొలగించాలని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆయన డ్రైవర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పవని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదరహితంగా వాహనాలను నడపాలని కోరారు.