- - టిటిసిలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
- - ఆటో డ్రైవర్లు విడ్జిగా ఖాకి చొక్కా ధరించాలి
- - ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
నల్లగొండ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వల్లనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద అన్నారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఖాకీ చొక్కా విధిగా ధరించడంతో పాటు లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు కారణం కావద్దని ఆమె ఆటో డ్రైవర్లకు సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో సత్ప్రవర్తనతో మెలుగాలని, ప్రమాదాల నివారణకు సహకరిస్తూ ప్రమాదరహిత నల్లగొండగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దని సూచించారు. ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకునే సమయంలో, దింపే సమయంలో రోడ్డు పక్కన ఆపాలని, తద్వారా ప్రయాణికుల భద్రత లక్ష్యంగా మన్ననలు పొందాలని ఆమె సూచించారు.
నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల పట్ల, సైనేజ్ ల పట్ల.అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను అందరి సౌకర్యార్థం నిర్మించడం జరిగిందని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డ్రైవింగ్ లైసెన్స్, ఖాకీ షర్ట్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపకుండా ఆటో స్టాండ్ లలో మాత్రమే నిలపాలని కోరారు. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ పై శ్రద్ద వహించాలని, అలా కాకుండా భారీ శబ్దాలతో కూడిన మైక్ సెట్లను అమర్చి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించవద్దని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ లు లేని వారు జిల్లా పోలీసు కార్యాలయంలో రోడ్డు భద్రతా విభాగంలో, ట్రాఫిక్ పోలీసులను సంప్రదిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యదళారీల ప్రమేయం లేకుండా లైసెన్స్ ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. క్రమశిక్షణ, మంచితనం తో మెలుగుతూ ప్రయాణికుల నుండి మన్ననలు పొందాలని, ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, ప్రమాదరహిత నల్లగొండగా తీర్చిదిద్దడంలో ఆటో డ్రైవర్లు అంతా సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్, డిటిఆర్బ్ ఎస్పీఓ అంజయ్య, ఎస్.ఐ. జయానందం,
ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ.లు తూడి సుధాకర్, జహంగీర్, సిబ్బంది మహేందర్, వేంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.