*కోవిడ్ నిబంధనలతో బక్రీద్ ప్రార్థనలు : డిఐజి రంగనాధ్*
- - ముస్లిం పెద్దలతో కలిసి ఈద్గా వద్ద ఏర్పాట్లు పరిశీలన
- - మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న నల్లగొండ జిల్లా
- - శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుకలు
నల్లగొండ : బక్రీద్ పండుగ వేడుకలు, ఈద్గాల వద్ద నిర్వహించే ప్రార్ధనలు కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ సందర్భంగా చేసిన ఏర్పాట్లను ఆయన ముస్లిం మత పెద్దలు, పోలీస్ అధికారులు, ఈద్గా కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈద్గా వద్ద చేస్తున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈద్గా కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో బక్రీద్ పర్వదిన సందర్బంగా అన్ని ఈద్గాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో విధిగా మాస్కులు ధరించడం, ఈద్గాల పరిసరాలను సానిటైజ్ చేయడం లాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నల్లగొండ జిల్లా హిందు, ముస్లిం పండుగలను ఐకమత్యంగా నిర్వహించుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణంలో జిల్లాలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే *బక్రీద్* పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
డిఐజి రంగనాధ్ వెంట హఫీజ్ ఖాన్, డాక్టర్ ఏ.కె.ఖాన్, మౌలానా ఇసాముద్దీన్, జియావుద్దీన్, షబ్బీర్, ఖాజీముల్లా, బషీరుద్దీన్, మూర్తుజా, వహిద్, మోయిన్, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, నల్లగొండ వన్ టౌన్ సిఐ బాలగోపాల్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఈద్గా కమిటీ సభ్యులు తదితరులున్నారు.