*భారత సైన్యం అసమాన ప్రతిభకు నిదర్శనం కార్గిల్ పోరు- `కార్గిల్ విజయ్దివస్`నేపథ్యంలో క్షేత్ర ప్రచార విభాగం వరంగల్ ఆధ్వర్యంలో వెబినార్- పాల్గొని ప్రసంగించిన సీనియర్ నాన్ కమాండెంట్ ఆఫీసర్*
*వరంగల్ జిల్లా సైనిక ఉద్యోగుల వ్యవస్థాపకుడు అయిలయ్య- యువత సైన్యంలో చేరాలని సూచన*
వరంగల్, జూలై 27, 2021ః
భారత సైన్యం అసమాన ప్రతిభకు కార్గిల్ యుద్ధం నిదర్శనమని సీనియర్ నాన్ కమాండెంట్ ఆఫీసర్, వరంగల్ జిల్లా సైనిక ఉద్యోగుల వ్యవస్థాపకుడు అయిలయ్య పేర్కొన్నారు. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టిందని ఆ నాటి ఘట్టాలను స్మరించుకున్నారు. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకొని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్రప్రచార విభాగం వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ``కార్గిల్ వీరుల సంస్మరణ దినం``వెబినార్‌ను నేడు నిర్వహించింది.
ఉగ్రవాదం ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్ చేసిన కుటిల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టి కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటికి 22ఏళ్లు పూర్తయ్యిందని అయిలయ్య పేర్కొన్నారు. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో 1999, మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోగా ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసిందని తెలిపారు. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా, 1536 మంది గాయపడ్డారు. యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపించాలని అయిలయ్య కోరారు. వరంగల్ క్షేత్ర ప్రచార అధికారి శ్రీధర్ సూరునేని సమన్వయకర్తగా వ్యవహరించిన వెబినార్‌లో ఆర్ఓబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, పలువురు మాజీ సైనిక ఉద్యోగులు, యువత పాల్గొన్నారు.