*అంతరాష్ట్ర నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ : వెస్ట్ జోన్ ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర*

 *అంతరాష్ట్ర నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ : వెస్ట్ జోన్ ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర*

- - మొత్తం ఆరు కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్

- - నాలుగు కోట్ల విలువ గల 20 టన్నుల పత్తి, రెండు కోట్ల విలువైన 200 టన్నుల వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు స్వాధీనం 

- - హైదరాబాద్ రేంజ్ ఐజి శివశంకర్ రెడ్డి, నల్లగొండ ఎస్పీ రంగనాధ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీధర్ రెడ్డిలతో కలిసి వివరాలు వెల్లడించిన ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర

- - తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 వేల ఎకరాలలో పంట నష్టపోకుండా కాపాడిన నల్లగొండ జిల్లా పోలీసులు

- - కర్నూల్ జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, హైదరాబాద్ లోని గుండ్ల పోచంపల్లి, బోయినపల్లి, దేవర యంజాల్, యల్లంపేట కేంద్రాలుగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న పాత నేరస్తుల ముఠా

- - 13 మంది నిందితుల అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు నిందితులు

- - నిందితుల నుండి రెండు కార్లు, 13 సెల్ ఫోన్లు, మిషనరీ స్వాధీనం

- - నైరుతి సీడ్స్ పేరుతో ఇల్లీగల్ దందా, నైరుతి సీడ్స్ ఎం.డి., ఎం.జి. అగ్రిటెక్ యాజమాని సహా పలువురి అరెస్ట్

 

నల్లగొండ : నకిలీ పత్తి విత్తనాలతో పాటు నకిలీ వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ రేంజ్ ఐజి శివ శంకర్ రెడ్డిలు తెలిపారు.


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు రైతులు నకిలీ పత్తి విత్తనాల వల్ల మోసపోకుండా చూడడం లక్ష్యంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డిల సూచనల మేరకు నల్లగొండ జిల్లా పోలీసులు నకిలీ పత్తి విత్తనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన క్రమంలో భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేయగలిగినట్లు వారు తెలిపారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీధర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి నకిలీ విత్తనాల ముఠా వివరాలను వెల్లడించారు. జిల్లా పోలీసులకు లభించిన ఖచ్చితమైన సమాచారం, నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన కొంత మంది రైతులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ ఫోర్స్ బృందాలు గడిచిన 15 రోజులుగా ఈ నకిలీ దందా విషయంలో లోతుగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. అరెస్ట్ చేయబడిన 13 మంది నిందితులలో నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్ రెడ్డి గతంలో తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాలలో అరెస్ట్ అయి గత సంవత్సరం నకిలీ పత్తి విత్తనాల కేసులో నల్లగొండ పోలీసుల చేత అరెస్ట్ చేయబడి పి.డి. యాక్ట్ లో వరంగల్ జైలుకు వెళ్లివచ్చినట్లు చెప్పారు. జైలు నుండి విడుదల అయిన అనంతరం తన మోస ప్రవృత్తిని మార్చుకోకుండా నకిలీ పత్తి విత్తనాలను సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసి తెలంగాణలోని పలు జిల్లాల్లో నకిలీ విత్తనాలను విక్రయించి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఖమ్మంకు చెందిన పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన బాలస్వామి, దేవరకొండకు చెందిన పిచ్చయ్య, హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, పవన్ లతో పాటు మరికొంత మందిని కలిసి పెద్ద ఎత్తున ఈ సీజన్ లో నకిలీ విత్తనాల దందాకు స్కెచ్ వేశారని, ఇదే సమాచారం పక్కాగా నల్లగొండ జిల్లా పోలీసులకు తెలియడంతో జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు సిఐలు బాలగోపాల్, ఎస్.ఎం. బాషా, చండూర్ సిఐ సురేష్ కుమార్, నల్లగొండ రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలు, శాలిగౌరరం సిఐ పి.ఎన్.డి. ప్రసాద్, తిప్పర్తి ఎస్.ఐ. సత్యనారాయణ, చిట్యాల ఎస్.ఐ. నాగరాజు, ఎస్.ఐ. నాగుల్ మీరా, ఇతర పోలీసుల సహకారంతో నకిలీ విత్తనాల దందా మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేసినట్లు వారు తెలిపారు. పోలీస్ విచారణలో భాగంగా సిద్దిపేటలోని గజ్వేల్, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలోని గుండ్ల పోచంపల్లి, యల్లంపేట, దేవర యంజాల్, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 140 టన్నుల నకిలీ వరి విత్తనాలు, 40 టన్నుల నకిలీ మొక్కజొన్న విత్తనాలు, నాలుగు కింటాళ్ల నకిలీ కూరగాయల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని నల్లగొండకు తరలించగా, నకిలీ వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను సీజ్ చేసినటువంటి జామ్ జామ్, ఎం.జి. అగ్రిటెక్ గోడౌన్లలో సిల్ వేసి ఉంచడం జరిగిందని తెలిపారు.


ఈ కేసులో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఏనుబోతుల శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో నైరుతి సీడ్స్ పేరుతో కంపెనీ స్థాపించి అదే పేరుతో నకిలీ విత్తనాల దందా నిర్వహిస్తున్నాడని చేప్పారు. శ్రీనివాస్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా రైతుల నుండి వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను తక్కువ ధరకు సేకరించి ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అవసరమైన జి.ఓ.టి. పరీక్షలను సైతం నిర్వహించకుండా, విత్తన చట్టాలను ఉల్లంఘిస్తూ తన విత్తనాలు నాణ్యమైనవిగా తానే స్వయంగా ప్రకటించుకొని, పత్తి విత్తనాలకు సంబందించిన ఎలాంటి లైసెన్స్ లేకుండా సీడ్స్ ప్యాకింగ్ కవర్లు, వాటిపై క్యూఆర్ కోడ్, ఇతర లేబుల్స్ ముద్రించి ప్రాసెసింగ్ యూనిట్లలో వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి విక్రయించేవాడని తెలిపారు. గడువు ముగిసిన ప్యాకెట్లను టిన్నర్ వినియోగించి గడువు తేదీలను చెరిపివేసి కొత్త తేదీలను ముద్రించి నకిలీ విత్తనాలను విక్రయించేవాడని చెప్పారు. ఇలా రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించిన శ్రీనివాస్ రెడ్డి కాకినాడకు చెందిన మెడిశెట్టి గోవిందు భాగస్వామి అయిన దేవర యంజాల్ లోని యం.జి. అగ్రి టెక్ ప్రాసెసింగ్ యూనిట్ లో నకిలీ పత్తి విత్తనాల గురించి విచారించగా గోవిందు నంద్యాలకు చెందిన గోరుకంటి పవన్ కుమార్ ను పరిచయం చేయగా అతని ద్వారా పాత నేరస్థులైన నంద్యాలకు చెందిన మధుసూదన్ రెడ్డి, స్వామిదాస్ ల వద్ద నుండి రిజెక్టేడ్ సీడ్స్, గడువు తీరిన విత్తనాలు, జిన్నింగ్ మిల్లుల నుండి పత్తి గింజలను తీసుకొని వచ్చి గోవిందుకు చెందిన ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రాసెస్ చేసిన అనంతరం ట్రూత్ ఫుల్ లేబుల్స్ ను  ముద్రించి నకిలీ పత్తి విత్తనాలను నాణ్యమైన విత్తనాలుగా నమ్మించేలా రసాయన రంగులు వినియోగించి అందమైన కవర్లలో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు ఈ ముఠా గుట్టును చేధించినట్లు ఐ.జి. వివరించారు. ఈ నకిలీ విత్తనాలను కొనుగోలు చేసిన అనంతరం దిగుబడి తక్కువగా వచ్చినా, తనను ఎవరైనా నష్ట పరిహారం ఆడిగేందుకు వచ్చినా రైతు భూమి సారవంతంగా లేదని, వర్షాలు సరిగా పడకపోవడం వల్లనే దిగుబడి రాలేదని, పంటకు ఫర్టిలైజర్స్ సరిగా వడలేదనే అంశాలను సాకులుగా చెప్పి తప్పించుకోవాలని శ్రీనివాస్ రెడ్ది భావించినట్లు తెలిపారు. అంతే కాకుండా విత్తనాల డీలర్లు పలు కంపెనీలకు చెందిన విత్తనాలను మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.


*రైతాంగాన్ని నమ్మించడానికి ఐసీఏఆర్ ......*

పత్తి విత్తనాల లైసెన్స్, విక్రయాలకు అనుమతి లేకుండానే శ్రీనివాస్ రెడ్డి తాను విక్రయించే నకిలీ విత్తనాలను నాణ్యమైనవిగా రైతులను నమ్మించేందుకు గాను నాగ్ పూర్ కు చెందిన ఐ.సి.ఏ.ఆర్. సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా అవసరం లేకున్నా ప్యాకింగ్ కవర్లపై ముద్రిస్తున్నాడని వివరించారు.


*నకిలీ విత్తనాలను విక్రయించేందుకు టార్గెట్ గా.....*

ఈ ముఠా తయారు చేసిన నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు వర్షాదారిత పంటలు ఎక్కవగా వేసే ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాతో పాటు పలు ప్రాంతాలను ఎంచుకొని నకిలీ విత్తనాలు విక్రయించాలని టార్గెట్ గా చేసుకున్నారన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి అయిదు జిల్లాలలో రైతాంగాన్ని మోసం చేసేందుకు ఈ ముఠా తమ అనుచరులతో రెండు తెలుగు రాష్ట్రాలలో నకిలీ విత్తనాల మార్కెటింగ్, విక్రయాలు చేయడానికి ప్రయత్నాలు చేశారని స్పష్టం చేశారు.


మరో ప్రధాన నిందితుడు మధుసూదన్ రెడ్డి 2016 నుండి నకిలీ విత్తనాల కేసులలో శంషాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డ, నల్లగొండ జిల్లా చండూర్, మునుగోడు, నకిరేకల్, గుర్రంపోడులలో అరెస్ట్ కాబడి గత సంవత్సరం పి.డి. యాక్ట్ నమోదు చేయబడి జైలుకు వెళ్లి తిరిగివచ్చి మళ్లీ ఇదే వ్యాపారాన్ని చేస్తున్నాడని వివరించారు. నంద్యాల ప్రాంతానికి చెందిన గోష స్వామిదాస్, దుబ్బ వెంకట శివారెడ్డి, హుస్సేన్ వలి అలియాస్ బాషా, బండారు సుధాకర్ తదితరుల వద్ద నుండి కిలో 200 రూపాయలకు కొనుగోలు చేసి, రైతులకు కిలో 900 రూపాయలు (అరకిలో ప్యాకెట్ కు రూ. 450/-) చొప్పున విక్రయిస్తారని చెప్పారు. తన అనుచరులైన చెన్నకేశవ రెడ్డి, మధుల సహకారంతో వీటిని రవాణా చేస్తున్నాడన్నారు.


నంద్యాలకు చెందిన మరో నిందితుడు, పలు కేసులలో జైలుకెళ్లిన గోరుకంటి పవన్ కుమార్ ప్రధాన నిందితులతో నకిలీ విత్తనాలను కమీషన్ వ్యాపారం చేస్తూ దందా సాగిస్తున్నాడని చెప్పారు.


ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితురాలు, ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి భార్య, నైరుతి సీడ్స్ భాగస్వామి ఏనుబోతుల రజిత భర్త శ్రీనివాస్ రెడ్డి నకిలీ విత్తనాల దందాకు చేదోడుగా నిలుస్తూ అతని అనుచరులను సమన్వయం చేస్తుండేదన్నారు.


డిఐజి ఏ.వి.రంగనాధ్ పర్యవేక్షణలో ఈ కేసులో సమర్ధవంతంగా పని చేసిన టాస్క్ ఫోర్స్ సిఐలు బాలగోపాల్, ఎస్.ఎం. బాషా, చండూర్ సిఐ సురేష్ కుమార్, నల్లగొండ రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నల్లగొండ మండల వ్యవసాయ శాఖాధికారి సుమన్ కీలకంగా పని చేయగా శాలిగౌరరం సిఐ పి.ఎన్.డి. ప్రసాద్, తిప్పర్తి, చిట్యాల ఎస్.ఐ.లు సత్యనారాయణ, నాగరాజు, మరో ఎస్.ఐ. నాగుల్ మీరా, సిసిఎస్ ప్రభాకర్, ఐటి కోర్ కానిస్టేబుల్ మధు, పోలీస్ సిబ్బంది రవుఫ్, ఇమ్రాన్, రాజు, రేవతి, రమేష్, శ్రీను, ఆంజనేయులు తదితరులు కేసు చేధించడంలో సహకరించారని, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్ది, నల్లగొండ టూ టౌన్ సిఐ చంద్ర శేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేశారని, వీరందరిని ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.


ఈ మొత్తం కేసులో సమర్ధవంతంగా పనిచేసిన పోలీస్ అధికారులందరికి డిజిపి మహేందర్ రెడ్డి రివార్డులు, పతకాలు ప్రకటించినట్లు ఐ.జి. స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.


*వెస్ట్ జోన్ పరిధిలో ఇప్పటి వరకు 141 కేసులు*

నకిలీ పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయల విత్తనాలు వెస్ట్ జోన్ పరోధిలో 13 జిల్లాలలో 141 కేసులు నమోదు చేయడం ద్వారా సుమారు 21 కోట్ల 12 లక్షల 96 వేల రూపాయల విలువైన విత్తనాలను సీజ్ చేయడం జరిగిందని వివరించారు. నల్లగొండలో సీజ్ చేసిన ఆరు కోట్ల రూపాయల నకిలీ విత్తనాలతో కలిపి మొత్తం 27 కోట్ల 12 లక్షల 96 వేల రూపాయల విలువైన విత్తనాలను సీజ్ చేయడం జరిగిందని ఆయన వివరించారు.


*కేసులో ముఖ్యమైన అంశాలు...*

- - తెలంగాణ ప్రాంతంలో ఒక ఎకరానికి రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాలు అంటే సుమారు కిలో విత్తనాలు వినియోగించే పరిస్థితులున్నాయి.

- - ఈ కేసులో సీజ్ చేసిన 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాల ద్వారా సుమారు 20 వేల ఎకరాలు, 140 టన్నుల నకిలీ వరి విత్తనాల ద్వారా 10 వేల ఎకరాలు, 40 టన్నుల నకిలీ మొక్కజొన్న విత్తనాల ద్వారా 10 వేల ఎకరాలు మొత్తంగా 40 వేల ఎకరాల భూమిలో నకిలీ విత్తనాలు నాటకుండా రైతాంగాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు కాపాడగలిగారు.

- - నాణ్యమైన పత్తి విత్తనాల ద్వారా ఎకరానికి 10 నుండి 15 కింటాళ్లు రావాల్సిన పత్తి దిగుబడి ఈ నకిలీ విత్తనాల ద్వారా కేవలం ఎకరానికి ఎకరానికి 5 నుండి ఎనిమిది కింటాళ్లు మాత్రమే వస్తుంది.ఈ విలేకరుల సమావేశంలో డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, కృష్ణా రావుతో పాటు పలువురు పోలీస్ అధికారులున్నారు.




- గత ఆరు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి 22 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత సంవత్సరం వ్యవసాయ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ నకిలీ పత్తి విత్తనాల దండాలో భాగస్వామ్యం వహించిన నిర్మలను అరెస్ట్ చేయడంతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల ikపై పి.డి. యాక్ట్ నమోదు చేయడం జరిగింది.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...