ధాన్యం కొనుగోళ్ళలో రైతాంగం పడుతున్న బాధలకు పరిష్కారాలు కోరుతూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్ ను కలిసిన ప్రొఫెసర్ కోదండరామ్ బృందం

 ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా రైతాంగం పడుతున్న బాధలకు పరిష్కారాలు కోరుతూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్


ఎం. రఘునందన్ రావు కు, పౌర సరఫరా శాఖ కమీషనర్ వి. అనిల్ కుమార్ కు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు శ్రీశైల్ రెడ్డి పంజుగుల, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెబోయిన శ్రీధర్ బృందం వినతి పత్రాలు సమర్పించింది. వ్యవసాయ కమిషనర్ తరఫున జాయింట్ డైరక్టర్ బి. బాలు నాయక్ ఈ బృందంతో చర్చించారు. 


*వినతిపత్రంలోని అంశాలు - డిమాండ్స్*

తెలంగాణలో తమ ప్రభుత్వ విధానాల వల్ల అత్యధికంగా వరి దిగుబడి సాధిస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నది. కానీ ఆ వరి పండించే రైతాంగం ప్రభుత్వ నిర్లక్ష్యం, దళారీల దోపిడీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ఐకేపీలు, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు జరిగేది. గత ఏడాది లక్ష్యాల ప్రకారం కావలసినన్ని, హామీ ఇచ్చినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.  ఉన్న కేంద్రాలు కూడా సరిగా పనిచేయడం లేదు. పనిచేసే చోట కూడా రైతులు ఈ దిగువ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 

1. కొనుగోలు కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. 

2. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు కనీసం 10 నుంచి 60 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తున్నది. గొనె సంచుల కొరత, రవాణా సౌకర్యాల లేమి, హమాలీలు లేకపోవడం కారణంగా ధాన్యం కొనుగోలులో, మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ధాన్యం ఎపుడు కొంటారో తెలువక వ్యవసాయ పనులన్నీ మానుకుని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడవలసి వస్తున్నది. 

3. ఈ వేచిచూసే సమయంలో అకాల వర్షాలు వస్తే రైతుల బాధలు వర్ణనాతీతం. తడిచిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనడంలో అధికారులు వేసే కొర్రీలు, చేసే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. చాలావరకు కొనుగోలు కేంద్రాలు పల్లపు ప్రాంతాల్లో ఉండడం ఈ సమస్యను ద్విగుణీకృతం చేస్తున్నది. 

4. వ్యవసాయ విస్తారణాధికారి సమక్షంలో తరుగు తీసి, కాటా వేసి కూడా రశీదు ఇవ్వడం లేదు. ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపినపుడు మిల్లు యాజమాన్యం కాకి లెక్కలు చెప్పి మరోసారి తరుగు తీస్తున్నారు. దానికి ఒప్పుకున్న రైతుల ధాన్యాన్ని మాత్రమే బిల్లు చేసి సంబంధిత శాఖలకు పంపుతున్నారు. ఇక్కడ రైతు విపరీతమైన దోపిడీకి గురవుతున్నాడు. 

5. కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకు 42-43 కిలోల ధాన్యం కాంటా వేస్తున్నారు. అంటే క్వింటాలుకు 2-3 కిలోలు తరుగు రూపంలో అదనంగా తీసుకుంటున్నారు. ఈ సీజన్ లో ఇట్లా దోపిడీ చేసిన మొత్తం విలువ రూ. 755 కోట్లు ఉంటుందని పత్రికల రిపోర్టులు ఉన్నాయి.

6. అసలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి Food Corporation of India స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల సంస్థ పర్యవేక్షణలో జరిగే కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా ఈ మార్గదర్శకాలు పాటించడం లేదు. 

7. ధాన్యంలో తాలు ఎక్కువ ఉందనే నెపంతో రైతులే మరోసారి తూర్పార పట్టి ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. ఉదాహరణకు వంద బస్తాలు తెచ్చిన రైతులు మరోసారి తూర్పార పట్టడానికి రూ. 5 వేల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తున్నది. హార్వేస్టర్ తో వరి కోయించినపుడు అందులో ఉండే బ్లోయర్ ద్వారా తూర్పార పట్టడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ తాలు మిగిలివుంటే, అది యాంత్రిక సమస్య, వాటిని సర్టిఫై చేయడంలో జరిగిన అవకతవకల సమస్య. దీనికి రైతును బాధ్యులను చేయడం, కష్టాలకు నష్టాలకు గురి చేయడం సరికాదు. 


వెంటనే తగు చర్యలు తీసుకుని పై సమస్యలు పరిష్కరించాలి. రైతులను మిల్లర్ల దయాదాక్షిన్యాలకు ఒదిలేయకూడదు. ఎఫ్.సి.ఐ మార్గదర్శకాలను అమలు చేయాలి. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులకు రక్షణ కల్పించాలి.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...