పక్క రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు అదనపు ఎస్పి నర్మద

*పక్క రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు : అదనపు ఎస్పీ నర్మద*


- - నల్గొండ జిల్లాలో సరిహద్దు చెక్ పోస్టులను పరిశీలించిన అదనపు ఎస్పీ నర్మద
- - నిఘా మరింత పెంచాలని పోలీస్ అధికారులకు సూచన


నల్గొండ : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో పాటు పెద్ద ఎత్తున రైతులు ధాన్యం తీసుకువస్తున్న క్రమంలో వారికి కనీస మద్దతు ధర కల్పించడం, పక్క రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద తెలిపారు.


మంగళవారం ఆమె వాడపల్లి, నాగార్జున సాగర్ ప్రాంతాలలోని సరిహద్దు చెక్ పోస్టులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని సూచించారు. సిసి కెమెరాలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ కు వాటిని అనుసంధానం చేయడం ద్వారా పక్క రాష్ట్రాల నుండి ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకుంటూ జిల్లాలోని రైతాంగం తీసుకువచ్చే ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి అయ్యే విధంగా, రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఖచ్చితంగా అందే విధంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ల నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్స్ మిల్లర్ల వద్ద జరుగుతున్న కొనుగోళ్లు పరిశీలిస్తూ ఎక్కడైనా రైతులకు మద్దతు ధర చెల్లించకుండా మోసం చేసే మిల్లులపై దాడులు నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు.


ప్రధానంగా పక్క రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమంగా మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చెక్ పోస్టులను పరిశీలించడం జరుగుతున్నదని చెప్పారు. చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరి కొంత మందిని ఏర్పాటు చేస్తామని, 24 గంటల పాటు నిఘా ఉంచడం ద్వారా పటిష్ఠంగా ధాన్యం పక్క రాష్ట్రాల నుండి ఎట్టి పరిస్థితులలో రాకుండా చూస్తామని తెలిపారు.


*రైస్ మిల్లుల పరిశీలన*


అనంతరం ఆమె మిర్యాలగూడ, శెట్టిపాలెం ప్రాంతాలల్లో రైస్ మిల్లులను సందర్శించి రైతులతో మాట్లాడారు. మిల్లులకు తీసుకువస్తున్న ధాన్యం సక్రమంగా కొనుగోలు చేస్తున్నారా, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తున్నారా లేదా అని ఆమె రైతులను అడిగి తెలుసుకున్నారు. తీసుకువస్తున్న ధాన్యంలో మాయిశ్చర్ ఎంత శాతం తీస్తున్నారో ఆమె రైతులను అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధర విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నం చేసినా నిర్భయంగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. రైతుల నుండి అందే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.


ఆమె వెంట మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఇతర పోలీస్ అధికారులున్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...