*సాండ్ ట్యాక్సీ ని పటిష్ఠంగా అమలు చేస్తాం : నల్గొండ డిఎస్పీ*
నల్గొండ : కనగల్ మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి సాండ్ ట్యాక్సీ విధనాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని నల్గొండ డిఎస్పీ జి. వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
సోమవారం సాయంత్రం కనగల్ మండలం దర్వేషిపురం గ్రామంలో ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా కచ్చితంగా అడ్డుకుంటామని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కనగల్ మండల పరిధిలోని పర్వతగిరి, లింగోటం వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా చేసే వారిని గుర్తించేందుకు గ్రామ పంచాయితీల నిధుల నుండి ఎనిమిది లక్షల రూపాయలతో సాధ్యమైనంత త్వరగా 40 సిసి కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. సాండ్ ట్యాకి విధానంలో అన్ని ట్రాక్టర్ల డ్రైవర్లకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు తీసుకునే చర్యలకు ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన సూచించారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరిస్తూ అక్రమ రవాణా అడ్డుకుంటామని, నిబంధనలు అతిక్రమించే వారి పట్ల మరింత కఠిన వైఖరి తప్పదని హెచ్చరించారు.
సమావేశంలో చండూర్ సిఐ సురేష్ కుమార్, నల్గొండ రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, మైనింగ్ అధికారులు అమరేందర్ రావు, వెంకటేశ్వర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.