*భూ సమస్య య పరిష్కారం కోసం చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలి : ఎస్పీ రంగనాధ్*
- - న్యాయ నిపుణులతో పోలీసులకు ఒక రోజు వర్క్ షాప్
- -పోలీస్ అధికారులకు భూ చట్టాలపై మరింత అవగాహన కల్పించేందుకే వర్క్ షాప్
- - భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
- - సామాన్యులు, బలహీనులకు అండగా నిలిచినప్పుడే పోలీస్ శాఖకు మరింత గౌరవం
- - పెరిగిపోతున్న భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
నల్గొండ : పెరిగిపోతున్న భూ సమస్యలను సులువుగా పరిష్కరించడానికి ప్రతి పోలీస్ అధికారి భూ చట్టాలపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని అప్పుడే మరింత సమర్ధవంతంగా పని చేయవచ్చని జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు.
శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భూ తగాదాలు, సమస్యలకు పరిష్కార మార్గాల కోసం వర్క్ షాప్ నిర్వహించారు. భూ సమస్యలపై విస్తృత అవగాహన కలిగిన హైకోర్టు న్యాయవాది సునీల్, మరో హైకోర్టు న్యాయవాది బాలకృష్ణ, వరంగల్ కు చెందిన దుర్గాజీలు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న భూ చట్టాలు, భూ సమస్యలపై ముందుకు సాగాల్సిన విధానం, ప్రజల నుండి వచ్చే భూ సమస్యల ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
వర్క్ షాప్ లో ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ భూ సమస్యలను చాలా ప్రధానమైన సమస్యగా భావించాల్సిన అవసరం ఉన్నదని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. భూ సమస్యలు శాంతి భద్రతల సమస్యలుగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలని, ఏ రకమైన చర్యలు తీసుకుంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయనే విషయాలపై శ్రద్ద వహించి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో స్వాధీనంలో ఉన్న వ్యక్తుల వివరాలను క్షేత్ర స్థాయిలో విచారణ చేసి ప్రాధమిక ఆధారాలు సేకరించడం ద్వారా కబ్జాలో జన్న వారిని కదిలించకుండా ఉండేలా ముందుకు సాగాలని సూచించారు. బలహీనులకు అండగా నిలిచి వారికి న్యాయం అందించే దిశగా పని చేసినప్పుడే పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయని ఎస్పీ చెప్పారు. నల్గొండ జిల్లాలో గ్రీవెన్స్ లో అత్యధికంగా భూ సమస్యలు వస్తున్న క్రమంలో వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు. ఎంతో మంది పోలీస్ అధికారులు భూ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా శాఖాపరమైన చర్యలకు సైతం గురి అవుతున్నారన్నారు. పోలీస్ అధికారులందరికి భూ సమస్యలపై అవగాహన కల్పించడం, భూ చట్టాల గురించి తెలుసుకోవడం, భూ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలో తెలుసుకునే లక్ష్యంతోనే ఈ వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
నల్సార్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్, ల్యాండ్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సభ్యులు, భూ సమస్యల నిపుణుడు, హైకోర్టు న్యాయవాది సునీల్ మాట్లాడుతూ ఏ భూమి నుండి ఎవరి వద్ద ఎంత పన్ను వసూలు చేయాలో నిర్ణయించదానికే భూ సర్వేలు, రికార్డులు రూపొందించబడ్డాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ, టైటిల్ బీమా చట్టం తీసుకురావడానికి కృషి జరుగుతుందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆయన తెలిపారు. భూమి హక్కుల నిరూపణలో భూమి స్వాధీనంలో ఉన్న వ్యక్తి భూ యజమనిగా గుర్తిస్తున్నామని, ఆయితే వీటితో పాటు భూమి తమదే అని చెప్పే కనీస ఆధారాలు సైతం ఉండాలని, అప్పుడే భూ యాజమాన్య హక్కులు పొందవచ్చని ఆయన సూచించారు. ధరణి సాఫ్ట్ వేర్, భూ రికార్డుల ప్రక్షాళన, కోర్టు కేసులు, 13బి, ఆర్.ఓ.ఆర్., ఇనాం భూములు, టైటిల్ డీడ్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా, తెల్ల కాగితాల మీద ఒప్పందాలు, కౌలుదారు చట్టాలు, రక్షిత కౌలుదారు విధానం, రిజిస్టర్డ్ డీడ్స్, అసైన్ద్ భూములు, పి.ఓ.టి. చట్టం తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. దేశంలో ఎక్కువ నేరాలు, ఎక్కువ పోలీస్ కేసులు భూ సమస్యలు కారణంగానే జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో అధికారికంగా చెబుతున్నదన్నారు. అదే సమయంలో దేశంలో భూ సమస్యల కోసం వివిధ రకాలుగా 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అధికారిక లెక్కలు తెలియచేస్తున్నాయని చెప్పారు. భూమి చిరునామా, భూమి స్వభావం, భూ యాజమాన్య హక్కుదారు, భూమి కబ్జాలో ఎవరున్నారు అనే విషయాలను పూర్తిగా సరిగ్గా తెలుసుకున్నప్పుడే భూ సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చని దీనికి క్షేత్ర స్థాయి పర్యటన తప్పనిసరిగా చేయాలని ఆయన సూచించారు.
భూ సమస్యలపై నిపుణులు సునీల్ కుమార్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది బాలకృష్ణ, వరంగల్ కు చెందిన న్యాయవాది దుర్గాజీలు పోలీస్ అధికారులు అడిగిన భూ సమస్యలపై అడిగిన పలు సందేహాలకు పరిష్కార మార్గాలు, సమాధానాలు ఇచ్చారు.
సమావేశంలో నల్గొండ జిల్లా ప్రాసిక్యూషన్ డైరెక్టర్ శ్రీవాణి, అదనపు ఎస్పీ సి. నర్మద, నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డిఎస్పీలు జి. వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సిఐ రవీందర్, సురేష్, బాలగోపాల్, రమేష్, రాజశేఖర్ గౌడ్, శంకర్ రెడ్డి, మహబూబ్ బాషా, పి.పి.లు నరేందర్ రావు, జవహర్ లాల్, ఎస్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.