రైతుకు సంకెళ్లు వేసి రైతు ప్రభుత్వం అంటారా....
మాజీ పిసిసి అధ్యక్షుడు వి. హనుమంతరావు.
***************************************************"రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు విమర్శించారు.సోమవారం నల్లగొండలో జిల్లా జైల్లో ఉన్న బస్వాపురం భూ నిర్వాసితులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ తో కలిసి పరామర్శించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. రైతులతో పాటు మహిళలను సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం జైల్లో పెట్టిందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్వాపురం భూనిర్వాసులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక ఫలితాలు పునరావృత్తమవుతాయని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించి ప్రచారం చేసిన ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా గెలుపొందారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారం చేస్తారని అన్నారు.తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కెసిఆర్, కేటీఆర్ లు తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని, బిఆర్ఎస్ పార్టీ పేరుతో ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి సాగనంపుతారని అన్నారు.త్వరలో సూర్యాపేట జిల్లాలో బీసీ గర్జన నిర్వహిస్తామని తెలిపారు.బీసీ గర్జన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా హాజరవుతారని అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్, నాయకులు పాశం నరేష్ రెడ్డి,చర్లపల్లి గౌతమ్,సూరెడ్డి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.