*టిటిఐలో సోమవారం నుండి కౌన్సిలింగ్ : అదనపు ఎస్పీ నర్మద*
- - డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
- - కౌన్సిలింగ్ ద్వారా మందు బాబులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన
- - సిమిలేటర్, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాక్ సదుపాయాలతో టిటిఐ
నల్లగొండ : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారికి అవగాహన కల్పించేలా సోమవారం నుండి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద
తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక సందర్భాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చాలనాలు విధించడంతో పాటు కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇకపై జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని టిటిఐలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో పట్టుబడిన వారందరికి టిటిఐలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లాలోని అందరు పోలీస్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వాహనదారులను టిటిఐకి పంపించాలని ఆమె సూచించారు.
*సోమవారం డిఐజి రంగనాధ్ నేతృత్వంలో కౌన్సిలింగ్*
సోమవారం టిటిఐలో జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ నేతృత్వంలో తొలి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో సిమిలేటర్ తో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద వివరించారు.