మహిళల భద్రత లో రాజీ పడే ది లేదు: ఎస్పీ రంగనాథ్

*మహిళల భద్రతలో రాజీ పడేది లేదు : ఎస్పీ రంగనాధ్*


- - వైన్స్, దాబాలు, హోటల్స్ నిర్వహకులతో సమావేశం
- - మహిళల భద్రత విషయంలో మరింత సమర్ధవంతంగా చర్యలు
- - జిల్లాలో సుమారుగా 4,400 బెల్ట్ షాపులు
- - న్యూసెన్స్ జరిగే బెల్ట్ షాపులపై ప్రత్యేక దృష్టి
- - జిల్లాలోని అన్ని దాబాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
- - బెల్ట్ షాపులు ఖచ్చితంగా రాత్రి 10 గంటల కల్లా మూసివేయాలి


నల్గొండ : మహిళలకు అన్ని స్థాయిలలో, అన్ని సమయాలలో భద్రత కల్పించడంతో పాటు మహిళా భద్రతలో రాజీ లేకుండా సమర్ధవంతంగా పని చేస్తున్నామని  నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు.


మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులు, వైన్స్ నిర్వాహకులు, దాబాలు, హోటల్స్ నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ  మాట్లాడుతూ మద్యం మత్తులో ఎన్నో రకాల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉన్నదని అందుకు దిశ సంఘటన ఒక ఉదాహరణ అని ఆయన తెలిపారు. బెల్ట్ షాపులు కేవలం మద్యం విక్రయిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని కానీ బెల్ట్ షాపుల వద్ద కూర్చొని మద్యం తాగడం ప్రోత్సహిస్తే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్స్ నిర్వాహకులు సంబంధిత బెల్ట్ షాపులకు సిట్టింగ్స్ లేకుండా సూచనలు చేయాలన్నారు. బహిరంగ మద్యపానం నిరోదించడంలో మద్యం దుకాణాలపై బాధ్యత ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. న్యూసెన్స్ జరిగే, మహిళల ద్వారా పిర్యాదు చేసే బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మద్యం దుకాణదారుడు చుట్టు పక్కల బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా జాగ్రత్తలు వహించాలని, అలాంటి ప్రాంతాలను, అలా ఎవరైనా వ్యవహరిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితులలో దాబాలలో మద్యం విక్రయించకూడదని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారులపై దాబాలలో మద్యం విక్రయాలు జరిగితే సంబంధిత పోలీస్ అధికారులు, వారికి మద్యం విక్రయించిన వైన్ షాపుతో పాటు దాబాలపై చర్యలు తీసుకోవడంతో పాటు దాబాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని దాబాలలో ఖచ్చితంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత పోలీస్ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు. దేవాలయాలు, పాఠశాలల వద్ద బెల్ట్ షాపులు ఉంటే వాటిని వెంటనే మూసివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిర్మానుశ్య ప్రాంతాల్లో మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం ద్వారా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడాన్ని నిరోధించే అవకాశం ఉంటుందన్నారు. వైన్ షాపులలో మంచి నాణ్యత కలిగిన సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సిసి కెమెరాల నాణ్యత పరిశీలించడానికి ఐటి పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మద్యం వ్యాపారానికి గౌరవం తీసుకువచ్చే విధంగా చూడాలని ఎస్పీ కోరారు. వైన్స్ నిర్వాహకులు పోలీస్ శాఖతో సహకరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని కోరారు. మద్యం దుకాణదారులంతా షాపు ముందు పార్కింగ్ ఇష్టారాజ్యంగా జరగకుండా వాచ్ మెన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి వాటిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలోని అన్ని బెల్ట్ షాపులలో అవసరమైతే సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని ఆయన సూచించారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ క్రమంలో బెల్ట్ షాపులను కొంత నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకోసం అవసరమైతే సంబంధిత గ్రామ ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. ఆయన చెప్పారు.  మహిళల భద్రత దృష్ట్యా ఎక్కడైనా మహిళల నుండి వైన్స్, బెల్ట్ షాపులపై ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


అదనపు ఎస్పీ సి. నర్మద మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో మరింత నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వైన్స్, దాబాల వద్ద మరింత నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. వాహనాల పార్కింగ్ ఇష్టారాజ్యంగా జరగకుండా చూసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ నిర్వహించిన పలు సమావేశాలలో బహిరంగ ప్రాంతాలలో మద్యం సేవించే విషయంలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న క్రమంలో దీనిపై ఎక్కువ దృష్టి సారిస్తుస్తున్నట్లు ఆమె వివరించారు. సమావేశంలో పోలీస్ అధికారులు, వైన్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు.


సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకర్, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్  రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సిఐలు బాలగోపాల్, ఆదిరెడ్డి, రవీందర్, శంకర్ రెడ్డి, గౌరునాయుడు, సురేష్, బాషా, పి.ఎన్.డి. ప్రసాద్, జనార్దన్, రాజశేఖర్, ఎక్సైజ్ సిబ్బంది, ఎస్.ఐ.లు రవి కుమార్, పోలీస్ సిబ్బంది, వైన్స్ నిర్వాహకులు, దాబాలు, హోటల్స్ యజమానులు పాల్గొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...