*సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలి : అదనపు ఎస్పీ నర్మద*
- - పోస్టింగ్స్ చేసే ముందు ఆలోచించి చేయాలి
- - పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
- - ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా తల్లితండ్రులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలి
- - మహిళలు, విద్యార్థినీల రక్షణ లక్ష్యంగా షీ టీమ్స్ నిరంతర నిఘా
నల్గొండ : సామాజిక మాధ్యమాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వెంకటేశ్వర్ రావు సూచించారు.
శనివారం నల్గొండ పట్టణంలోని గౌతమీ జూనియర్ కళాశాలలో షీ టీమ్ పోలీస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడుతూ నిత్యం వాట్స్ అప్ పరిశీలించే క్రమంలో మనకు ఉపయోగకరమైన పోస్టులు చూసుకోవాలే తప్ప అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవద్దని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా విస్రృత ప్రచారం జరుగుతోందని ఇవి ఎన్నో అనర్ధాలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్ బుక్ లో చేసే పోస్టింగులకు లైక్స్ రాకపోతే నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితులు సమాజంలో ఏర్పడ్డాయని చెప్పారు. ఏదైనా పోస్టింగ్స్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆలోచించి పోస్టింగ్స్ చేయాలని సూచించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఇటీవల మన దేశంలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆమె అన్నారు. సామాజిక మాధ్యమాల విషయంలో ప్రతి అంశం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ మనలను మనం కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పారు. ఇటీవల ఫేస్ బుక్ లలో ఫేక్ అకౌంట్లు పెరిగిపోయాయని అందువల్ల ఇలాంటి వాటికి ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్ లని విద్యావసరాలకి వినియోగించుకోవాలే తప్ప అనవసరమైన విషయాలకు వినియోగించడం వల్ల మొబైల్ ఫోన్ మన శత్రువుగా మారుతున్నాయని తెలిపారు. రానున్న రోజులలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆమె అన్నారు. మహిళలు, యువతులు విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ కల్పించడం లక్ష్యంగా షీ టీమ్స్ ఏర్పాటు జరిగిందని తెలిపారు. మహిళలు స్వేచ్ఛగా, రక్షణతో ఉన్నప్పుడే ఆ సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యవుతుందని తెలిపారు. షీ టీమ్స్ లో ఇచ్చే ప్రతి పిర్యాదు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. అన్ని రకాలుగా జీవితాన్ని సుఖవంతంగా ముందుకు తీసుకుపోతూ ఉజ్వల భవిష్యత్తు కోసం మీకు మీరుగా కొన్ని హద్దులు నిర్ణయించుకోవాలని వారు సూచించారు.
2100 మందిని అదుపులోకి తీసుకొని వారి పై ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇటీవల సామాజిక మాధ్యమాలకు సంబంధించి సైబర్ క్రైం కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు మొబైల్ వాడకం తగ్గిస్తే ఇంకా మంచిదని సూచించారు. మొబైల్ ఫోన్ లే విద్యార్థులకు, యువతులకు ప్రధాన శత్రువుగా మారిందని చెప్పారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. షీ టీమ్స్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, కళాశాలలు, ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలలో రహస్యంగా సంచరిస్తూ ఆకతాయిల ఆగడాలు వీడియో రికార్డు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ధైర్యంగా తల్లితండ్రులకు, పోలీసులకు తెలియపరిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడంతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని గౌడ్ తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా పోలీస్ కళాబృందం కళాకారులు షీ టీమ్స్ పనితీరు, తెలంగాణ పోలీస్ తీసుకుంటున్న చర్యలపై ఆలపించిన పాటలు అందరిని అలరించాయి.
కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసికూటర్లు జవహర్ లాల్, శ్రీవాణి, షీ టీమ్స్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఏఎస్ఐ విజయ లక్ద్మీ, జమిల్, శంకర్, ప్రేమలత, ప్రసన్న, వాణి, జిల్లా కోర్టు లైజన్ అధికారి శ్రీను, షీ టీమ్స్ సిబ్బంది సోమిరెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాస విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.