*శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నప్పుడే పెట్టుబడులు, ఉపాధి సాధ్యం : శాసనమండలి చైర్మన్ గుత్తా*
- - పోలీసుల కృషి వల్లే రాష్ట్రంలో కనుమరుగైన తీవ్రవాదం
- - తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యం
- - శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానం
- - పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
నల్గొండ : శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలవడం రాష్ట్ర పోలీసుల కృషి ఫలితమేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరులకు నివాళులు ఆర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు పటిష్ఠంగా ఉన్నప్పుడే పెట్టుబడులు, ఉపాధి సాధ్యమవుతాయని, అందులో దేశంలోనే తెలంగాణ ప్రధమ స్థానంలో నిలిచిందని, ఈ ఘనత తెలంగాణ పోలీసులదేనని చెప్పారు. సంఘ విద్రోహక శక్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరుల కుటుంబాలకు నిరంతరం అండగా ఉంటామని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదులను అణచి వేయడంలో పోలీస్ శాఖ విజయవంతమయ్యిందని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని, రక్తపు బొట్టు చిందకుండా రాజ్యాధికారం పొందే అవకాశం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిందని అందుకే వారంతా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న శాఖ పోలీస్ శాఖ అని, తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ శాఖకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఏర్పడిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలో పోలీస్ శాఖకు బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హోమ్ గార్డులకు జీతం పెంపు, చనిపోయిన వారికి ఎక్సగ్రేషియా 40 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు. ప్రజల కోసం, సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు చేస్తున్న కృషి, వారి త్యాగం అజారామరమని సుఖేందర్ రెడ్డి అన్నారు.
జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మాట్లాడుతూ న్యాయానికి తొలిమెట్టు పోలీసులని, పోలీస్ స్టేషన్లు అనే నమ్మకంతో వచ్చే ప్రజలు, బాధితులకు న్యాయం అందించినప్పుడే పోలీస్ అమరుల నిజమైన నివాళి అన్నారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా, 24 గంటలు విరామం లేకుండా, పండుగలు, కుటుంబానికి దూరంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ అందించే క్రమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి మరణించిన అమరులకు అయన జోహార్లు అర్పించారు. పోలీస్ అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. పోలీసులంటే ప్రజల కోసం పని చేసే సేవలకులనే విధంగా మరింత సమర్ధవంతంగా సేవలందిస్తూ పోలీసుల గౌరవం, ప్రతిష్ట పెరిగే విధంగా బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా పని చేయాలని సూచించారు.
అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో విధి నిర్వహణలో అమరులైన 292 మంది పోలీసులు, జవాన్ల పేర్లు చదివి వినిపించారు.
స్మృతి పరేడ్ నిర్వహించారు. పరేడ్ కమాండర్ గా ఆర్.ఐ. వై.వి. ప్రతాప్ వ్యవహరించారు.
పోలీస్ కళాబృందం కళాకారులు అమరవీరుల త్యాగాలు, వారి త్యాగఫలంపై ఆలపించిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.
అమరవీరుల సంస్మరణ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలైన పోలీస్ అధికారులు, విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందచేసి అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్, నల్గొండ అదనపు ఎస్పీ టి. పద్మనాభ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, డిఎస్పీలు గంగారాం, సురేష్ కుమార్, గుజ్జ రమేష్, రమణారెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఆర్.ఐ.లు శంకర్, స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, నాయకులు సోమయ్య, జయరాజ్, సిఐలు సురేష్ బాబు అంజయ్య, రూరల్ ఎస్.ఐ. ఏ. రాజశేఖర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, అమరవీరుల కుటుంబాల అసోసియేషన్ అధ్యక్షురాలు నిర్మల, అమరవీరుల కుటుంబాలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.