- పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల పోస్టర్ విడుదల చేసిన ఎస్పీ
నల్గొండ : పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరమని వారి ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్క పోలీస్ పని చేయాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన పోలీస్ అధికారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితంగానే నేడు సమాజంలోని ప్రజలంతా విద్రోహ శక్తుల బారిన పడకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. వారోత్సవాలలో భాగంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రక్తదాన శిబిరం, ఓపెన్ హౌజ్, పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన వక్రుత్వ పోటీలు, పోలీస్ సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్, గత ఐదేళ్ల కాలంలో పోలీస్ వ్యవస్థలో జరిగిన మార్పులు ఇలా వివిధ అంశాలపై పోలీస్ స్టేషన్, సబ్ డీవిజన్, జిల్లా స్థాయిలలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని చెప్పారు. 21వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో అమరులైన పోలీస్, హోమ్ గార్డుల కుటుంబ సభ్యులను జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిచి అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడంతో పాటు వారికి పోలీస్ శాఖ మొత్తం వెన్నంటి నిలుస్తుందనే భరోసా కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రంగనాధ్ వివరించారు.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో ప్రజలు బాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలు, విద్యార్థులంతా సందర్శించే విధంగా ఓపెన్ హౌజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు, సిబ్బందికి నిర్వహించే వ్యాసరచన, పెయింటింగ్ పోటీలలో విజేతలకు 21వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే స్మృతి పరేడ్ రోజున అందచేయడం జరుగుతుందని తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, పోలీస్ సిబ్బందితో కలిసి అమరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతుందని ప్రజలు, పోలీస్ కుటుంబాలు కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి. పద్మనాభ రెడ్డి, ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఆర్.ఐ. వై.వి. ప్రతాప్, సిబ్బంది కార్తీక్, గురువయ్య, రియాజ్, కృష్ణ, వెంకన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.