*నిఘా నీడలో నిమజ్జన శోభాయాత్ర : డిఐజి రంగనాధ్*
- - సి.సి. కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
- - శోభాయాత్రకు భారీ బందోబస్తు
- - ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత
- - నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లు, పోలీసుల భద్రత
నల్గొండ : గణేష్ నిమజ్జన శోభా యాత్ర, నిమజ్జనం జిల్లాలో ప్రశాంతంగా జరిగే విధంగా పోలీస్ శాఖ భారీ బందోబస్తుతో పటిష్టమైన చర్యలు చేపట్టింది.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారులు, వివిధ కాలనీలలో ఉన్న అన్ని సి.సి..కెమెరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ కు అనుసంధానించి శోభాయాత్రను పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక నల్గొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ లాంటి ప్రధాన పట్టణాలలో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రను జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయ కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తూ సంబంధిత పోలీస్ అధికారులకు తగిన సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ తరఫున, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా మేము ప్రాజెక్టు సైతం కింద ఏర్పాటు చేసిన సుమారు 2400 సిసి కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్ లకు అనుసంధానించడం ద్వారా పటిష్ట నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభా యాత్రను పోలీస్ శాఖ పర్యవేక్షించనుంది. జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి డిఐజితో పాటు ఐ.టి.సెల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. నవరాత్రులు పూర్తి చేసుకొని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనే గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన పోలీస్ అధికారులు అందుకు అనుగుణంగా కేటాయించిన నంబర్ల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు.
ఇక జిల్లాలో నిమజ్జనం చేసే ప్రధాన ప్రాంతాలైన 14వ మైలు రాయి సాగర్ ఎడమ కాలువ, నల్గొండ పట్టణంలోని వల్లభ రావు చెరువు, వాడపల్లి, నాగార్జున సాగర్, దేవరకొండ, డిండి, మిర్యాలగూడ, వేములపల్లి కాలువల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఫ్లడ్ లైట్లు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసింది. గజ ఈతగాళ్లను నిమజ్జన ప్రాంతాల వద్ద అందుబాటులో ఉంచింది. ఎక్కడా ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఏదైనా సంఘటన జరిగితే జిల్లాలోని ఏ ప్రాంతానికైనా కేవలం ఐదు నుండి పది నిమిషాల వ్యవధిలో చేరుకునే విధంగా పెట్రో వాహనాలు, బ్లూ కోట్స్, సంబంధిత పోలీస్ అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఆన్ లైన్ విధానం ద్వారా భద్రత పర్యవేక్షించనున్నారు.
*నిమజ్జనం భద్రత కోసం 1500 మందికి పైగా సిబ్బంది*
భద్రతాపరమైన అంశాలలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. డిఐజితో పాటు ఒక ఎస్పీ, ఒక అదనపు ఎస్పీ, అయిదుగురు డిఎస్పీలు, 26 మంది సిఐలు, అయిదుగురు ఆర్.ఐ.లు, 75 మంది ఎస్.ఐ.లతో పాటుగా 900 మందికి పైగా ఏ.ఎస్.ఐ., హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోమ్ గార్డులు కాకుండా ఏ.ఆర్. సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా ఒక్కో సబ్ డివిజన్ కు 50 మంది చొప్పున 150 మంది పోలీస్ వాలంటీర్లు సైతం ఈ సారి గణేష్ నిమజ్జన శోభాయాత్ర బందోబస్తులో భాగస్వామ్యం వహించనున్నారు. ఇక వీరితో పాటు తెలంగాణ స్పెషల్ పోలీస్, ఫారెస్ట్, ఆబ్కారీ శాఖల అధికారులు సైతం బందోబస్తులో భాగస్వామ్యం వహిస్తారు.
*నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్*
గణేష్ నిమజ్జన శోభాయాత్ర జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని డిఐజి ఏ.వి.రంగనాధ్ స్పష్టం చేశారు. కమ్యునల్ సంబంధిత కేసులలో ఉన్న వారిని బైండోవర్లు చేశామని, రౌడీ షీటర్లతో పాటు క్రిమినల్ రికార్డు ఉన్న వారి కదలికలపై నిఘా పెట్టమని చెప్పారు. గణేష్ మండపాల నిర్వహకులంతా మంచి కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా కనిపించే విధంగా చూడాలని, మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దని చెప్పారు. నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని అయితే మండపాల నిర్వాహకులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని సూచించారు. నిర్దేశించిన విదంగా క్రమపద్ధతిలో శోభాయాత్రలో పాల్గొనాలని పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో శోభా యాత్ర బందోబస్తు నిర్వహిస్తున్నామని వివరించారు. రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన చోటు చేసుకోకుండా గణేష్ నిమజ్జనం జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. శోభయాత్ర సందర్భంగా జిల్లాలోని అన్ని వైన్ షాపులను మూసి వేయించడం జరిగిందని, ఎవరైనా నిబంధనలు పాటించక పోయినా, శోభాయాత్రలో డి.జె.లు వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శోభా యాత్ర ప్రశాంతంగా నిర్వహించుకునేలా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్సవ కమిటీల సభ్యులు, శాంతి సంఘం సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని మతాల పెద్దలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు చేయడం జరిగిందని డిఐజి రంగనాధ్ వివరించారు.