*బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు : అదనపు ఎస్పీ నర్మద*
- - బ్యాంకుల వద్ద గంపులుగా ఉన్న మహిళలకు సూచనలిచ్చిన అదనపు ఎస్పీ
- - కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో సహకరించాలి
- - మహిళా సిబ్బంది ఏర్పాటు ద్వారా సామాజిక దూరం పాటించేలా చర్యలు
నల్లగొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్న డబ్బులు తీసుకోవడానికి మహిళలు, వృద్ధులు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్న క్రమంలో విధిగా సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి. నర్మద తెలిపారు.
బుధవారం నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్టాఫీసులను ఆమె పరిశీలించి బ్యాంకర్లకు, సిబ్బందికి సూచనలు చేశారు. కోవిడ్ - 19 వ్యాప్తి నేపధ్యంలో ఎకౌంట్ల నుండి డబ్బులు తీసుకునేందుకు బయటికి వస్తున్న మహిళలు, వృద్ధులు విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణలో సహకరించాలని సూచించారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద మహిళలే అధికంగా ఉంటున్న క్రమంలో మహిళా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి అందరూ విధిగా సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనున్న క్రమంలో ప్రజలంతా పోలీసులతో సహకరించాలని, సూచనలు పాటించాలని ఆమె కోరారు.
*టోకెన్ విధానంలో డబ్బులు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడతాం*
బ్యాంకు అకౌంట్ల నుండి డబ్బులు డ్రా చేయడానికి మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్న క్రమంలో వీరిని నియంత్రించడానికి ప్రభుత్వ చౌక ధరల దుకాణాల వద్ద రేషన్ ఇచ్చేందుకు టోకెన్లు జారీ చేసిన విధంగా పోస్టాఫీసులు, బ్యాంకుల వద్ద సైతం 50 నుండి 80 మంది వరకు అకౌంట్ల నుండి డబ్బులు డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేయడానికి బ్యాంకులు, పోస్టల్ అధికారులతో మాట్లాడతామని అదనపు ఎస్పీ చెప్పారు. దీని ద్వారా నిర్దేశించిన వ్యక్తులకు జారీ చేసిన టోకెన్ల ఆధారంగా మాత్రమే డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తారని తద్వారా గుంపులుగా వచ్చే పరిస్థితి ఉండదని ఆమె తెలిపారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ శాఖతో అందరూ సహకరించి లాక్ డౌన్ సజావుగా అమలయ్యేలా చూడాలని అదనపు ఎస్పీ నర్మద కోరారు.